నేటి నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈరోజు నుండి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మొదలుకాబోతున్నాయి. ఈరోజు నుండి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. శ్రీస్వామివారి యగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు.. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు రుద్ర, చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేస్తున్నట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తారని ఈవో చెప్పుకొచ్చారు.తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు.