అంత‌రిక్షంలోకి న‌లుగురు సాధార‌ణ వ్య‌క్తులు

చ‌రిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్‌

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన దిగ్గజ ప్రవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చ‌రిత్ర సృష్టించింది. న‌లుగురు సాధార‌ణ సిబ్బందితో కూడిన స్పేస్‌క్రాఫ్ట్‌ను బుధ‌వారం రాత్రి అంత‌రిక్షంలోకి పంపించింది. ఇన్‌స్పిరేష‌న్ 4 పేరుతో జ‌రిగిన ఈ మిష‌న్ ద్వారా స్పేస్ ఎక్స్‌ తొలిసారి సాధార‌ణ వ్య‌క్తుల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. భూక‌క్ష్య‌లోకి వెళ్లిన ప్రొఫెష‌న‌ల్ కాని ఆస్ట్రోనాట్లు వీళ్లు. డ్రాగ‌న్ క్యాప్సూల్‌లో వీళ్లు స్పేస్‌లోకి వెళ్లారు. ఈ న‌లుగురు అంత‌రిక్షంలో మూడు రోజుల పాటు గ‌డ‌ప‌నుండ‌టం విశేషం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ కంటే కూడా 160 కిలోమీట‌ర్ల ఎత్తులో వీళ్లు భూమి చుట్టూ తిర‌గ‌నున్నారు.

మూడు రోజుల త‌ర్వాత ఇది మ‌ళ్లీ భూ వాతావ‌ర‌ణంలోకి వ‌చ్చి ఫ్లోరిడా తీరంలో కిందికి దిగ‌నుంది. పేమెంట్స్ కంపెనీ సీఈవో, ఫౌండ‌ర్ అయిన ఐజాక్‌మ్యాన్ ఈ మిష‌న్‌కు క‌మాండ్‌గా ఉన్నారు. స్పేస్ టూరిజంలోకి స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్ రావ‌డం ఇదే తొలిసారి. ప్రైవేట్ స్పేస్ టూరిజాన్ని ఇప్పటికే బ్లూ ఆరిజిన్‌, వ‌ర్జిన్ గెలాక్టిక్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే వాళ్లు స్పేస్‌లోకి ఇలా వెళ్లి అలా వెన‌క్కి వ‌చ్చేయ‌గా.. స్పేస్ ఎక్స్ మాత్రం మూడు రోజుల పాటు వాళ్ల‌ను అక్క‌డే ఉంచ‌నుండటం విశేషం.

ఈ మిష‌న్‌లో ఐజాక్‌మ్యాన్ స‌హా క్యాన్స‌ర్‌ను జ‌యించిన 29 ఏళ్ల హేలీ, అమెరిక‌న్ ఎయిర్‌ఫోర్స్ పైల‌ట్ క్రిస్ శామ్‌బ్రోస్కీ, సీన్ ప్రోక్ట‌ర్ కూడా ఉన్నారు. హ‌బుల్ టెలిస్కోప్ కంటే కాస్త ఎత్తులో భూమికి 575 కిలోమీట‌ర్ల దూరంలో ఈ డ్రాగ‌న్ క్యాప్సూల్ భూమి చుట్టూ తిర‌గ‌నుంది.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/