రేపు ఈడీ ముందుకు సోనియా..దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ రేపు ఈడీ ముందు హాజరుకాబోతున్నారు. వాస్తవానికి జూన్ 8 నే సోనియా ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా.. జూన్ 02 న ఆమె కోవిడ్ -19 బారినపడింది. ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ తన అనారోగ్యం గురించి ఈడీకి లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని వారిని అభ్యర్థించారు. ఈడీ ఆమె అభ్యర్థనను ఆమోదించింది. సోనియా గాంధీ సమన్లను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని కోరారని, అందుకే జూలై 21న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది. ఈ తరుణంలో రేపు సోనియా ఈడీ ముందు హాజరుకాబోతున్నారు.

ఐదు రోజుల ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని అడగనున్నట్లు IANSలో ఒక నివేదిక పేర్కొంది. “యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య ఒప్పందంలో ఆమె పాత్ర గురించి మేము అడగాలి” అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక రాహుల్ ను సైతం దాదాపు ఐదు రోజుల పాటు సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.