రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది: సోనియాగాంధీ

25వ రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు కార్యక్రమంలో సోనియాగాంధీ

Sonai Gandhi says, ‘Rajiv Gandhi’s political career ended in very brutal manner

న్యూఢిల్లీః మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీని గుర్తు చేసుకుని ఆయన భార్య, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజీవ్‌గాంధీ జయంతి సంద్భంగా నిన్న నిర్వహించిన 25వ రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ రాజకీయ జీవితం చాలా దారుణంగా ముగిసిందని అన్నారు. ఆయన పాలించింది కొంతకాలమే అయినా లెక్కలేనన్ని విజయాలు సాధించారని కొనియాడారు. మహిళా సాధికారతకు కృషి చేశారని, పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాడారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ఉండడం ఆయన చలువేనని ప్రశంసించారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. విభజన, ద్వేషం, మతోన్మాదం, పక్షపాత రాజకీయాలను ప్రోత్సహించే శక్తులు నేడు అధికారంలో ఉన్నాయని పరోక్షంగా బిజెపి పై విమర్శలు గుప్పించారు. శాంతి, మతసామరస్యం, జాతీయ సమైక్యత పెంపునకు కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు అందజేస్తున్నట్టు తెలిపారు. ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహించే శక్తులు చురుగ్గా ఉన్నప్పుడు ఈ అంశాలు ఇప్పుడు మరింత ముఖ్యమైనవని సోనియాగాంధీ పేర్కొన్నారు.