ఏపీ సర్కార్ ఫై కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు

ఏపీ సర్కార్ ఫై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీతో ఆదివారం సోము వీర్రాజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీలో కేంద్ర సహకారంతో నిర్మాణమవుతున్న ఇళ్లు నత్తనడకన సాగుతున్న తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు..

ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇళ్లను కేంద్రం కేటాయించిందని ఆయన అన్నారు.. కేంద్ర మంత్రికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు.. వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేయాలని కోరామన్నారు. కేంద్ర సహకారంతో జరుగుతున్న ఇళ్లకు వైస్సార్సీపీ కలర్లు వేస్తున్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన అనే బోర్డు లేకుండా వైస్సార్సీపీ ఇళ్లుగా మార్చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు.

ఈరోజు సోమవారం కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని సోము వీర్రాజు తెలిపారు. పోలవరంపై గతంలో కేంద్ర మంత్రి సమీక్ష చేశారని.. ప్రస్తుత పరిస్థితి ఏంటని, వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. అలాగే, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కూడా కలుస్తామన్నారు. పంచాయతీ సర్పంచుల నిధుల విషయంలో ఏపీలో గందరగోళం నెలకొందని సోము వీర్రాజు అన్నారు. ఏపీలో సర్పంచులకు నిధులు నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచుల ఖాతాల్లో పడ్డ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలోకి మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్టం చాలా నిధులు అడుగుతోందని.. అయితే, వాస్తవాలు తెలుసుకోవాలని ఏపీ బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు.