ప్రపంచంలో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ ‘సింహాద్రి’ ప్రదర్శన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’, రామ్ చరణ్ ఆరెంజ్ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘సింహాద్రి’ రీ రిలీజ్ కాబోతుంది.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సెన్షేషనల్ బ్లాక్‌బస్టర్ ‘సింహాద్రి’. 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటె ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ‘సింహాద్రి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. నిజం చెప్పాలంటే ‘సింహాద్రి’ రీ-రిలీజ్ కన్నా ఈ సినిమా మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ప్రదర్శితమవ్వబోతోంది అనే విషయమే అభిమానులకు ఎక్కువ కిక్ ఇస్తుంది. ఇప్పటికే ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. ఈ విషయాన్ని ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఐమ్యాక్స్ మెల్‌బోర్న్‌లో ఉదయం 9 గంటలకు ‘సింహాద్రి’ షో వేస్తున్నారు. టికెట్ ధర 28 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1533. ఇక ప్రీమియం టికెట్ ధర అయితే 44.50 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.2437). ఐమ్యాక్స్ మెల్‌బోర్న్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటే అదనంగా 2 డాలర్ల బుకింగ్ ఫీ కూడా ఉంటుంది. మరి ఆస్ట్రేలియాలో ఎంత మంది ‘సింహాద్రి’ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ మీద చూస్తారో చూడాలి.