ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు దొరికిన వెండి నాణేలు

ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలీలకు వెండి నాణేలు దొరికాయి. అబ్బా అనుకునేలోపే అధికారులు పట్టుకెళ్లారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేసే కూలీలు ఉదయాన్నే పనుల్లోకి వెళ్లారు. ఉపాధి పనులు చేస్తుండగా.. వారికి రెండు మట్టి కుండలు కనిపించాయి. పట్టలేని సంతోషంతో వాటిని తెరిచి చూస్తే అందులో 30 వెండి నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం రెట్టింపైంది.

దొరికిన నాణెలను అందరూ సమానంగా పంచుకున్నారు. ఎవరి వాటాలు వారు తీసేసుకున్నారు. అయితే ఎలా తెలిసిందో కానీ… వెండినాణెలు బయటపడిన విషయం ప్రభుత్వ అధికారుల చెవిలో పడింది. అంతే అధికారులు, తహసీల్దార్ గ్రామంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కూలీలను తహసీల్దార్ ఆదేశించారు. ఇక చేసేదేం లేక గురిగిలో మొత్తం 27 వెండి నాణేలు దొరికినట్టు ఉపాధి హామీ కూలీలు అధికారులకు తెలిపారు. కూలీల దగ్గర నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. దొరికిన నాణేలు మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలామణిలో ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది.