కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య..ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 20 న బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సిద్ధరామయ్యతోపాటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టినా.. ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం డైలమా కొనసాగుతోంది. సిద్దరామయ్య వర్సస్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం అయింది. ఫైనల్ గా సిద్ధరామయ్య ను సీఎం గా తేల్చారు. సీఎం రేసులో ఉన్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు.. కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. మే 18 వ తేదీన సాయంత్రం జరిగే సీఎల్పీలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్నాటక సీఎం పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న డీకేను బుజ్జగించేందుకు హైకమాండ్ చాలా శ్రమించాల్సి వచ్చింది.

ఇందులో భాగంగానే డీకేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు.. హోంశాఖ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్ల పాటు కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం కూడా ఇచ్చింది. అంతేకాదు.. డీకే శివకుమార్ సూచించిన ఆరుగురికి కీలకమైన మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.