నేటి నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో గొర్రెల పంపిణీ ఒకటి. దీని కింద గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తోంది కేసీఆర్ సర్కారు. నేటి నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు. 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ప్రభుత్వం 6085 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది.

ఇందులో ప్రభుత్వ వాటాధనం 4,563.75 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటా ధనం కింద రూ.1521.25కోట్లు ఉంది. లబ్ధిదారులకు గొర్రెల యూనిట్‌తో పాటు గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. గొర్రె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌గా గొర్రెను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. అంతే కాకుండా అవసరమైన మందులు, కొనుగోలు చేసిన ప్రాంతం నుండి గొర్రెలను లబ్ధిదారుడి ఇంటివరకూ చేర్చేందుకుఅయ్యే రవాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.

రెండో విడత కార్యక్రమాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా.. నకిరేకల్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయదావ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాల కలెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు కూడా హాజరుకానున్నారు.