కాంగ్రెస్‌ ఓటేస్తే మళ్లీ రూ.200 పెన్షన్‌ – మంత్రి కేటీఆర్

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్‌, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు గురువారం మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

అలాగే జడ్చర్లలో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ హయాంలో పెన్షన్‌ కూడా సరిగా లేదు. చారానకోడికి బారాన మసాలా అన్నట్లుగా ఇచ్చినోళ్లు ఇంద్రుడు చంద్రుడు అని డబ్బా కొట్టుకుంటూ పెద్ద పెద్ద బిల్డప్‌లు. జడ్చర్ల నియోజకవర్గంలోనే 32,477 మందికి నెలకు రూ.2వేలు, రూ.3వేల చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చి.. పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్‌ హయాంలో సంవత్సరానికి రూ.800కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో 46లక్షల మందికి సంవత్సరానికి రూ.12వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం. మేము చెప్పేదైతే కాంగ్రెస్‌ నాయకులు లెక్కలతో వస్తే లక్ష్మారెడ్డి చర్చలకు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

జడ్చర్లను గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీగా చేసేందుకు త్వరలోనే ఆదేశాలిస్తాం. ఎమ్మెల్యే కోరిక మేరకు రూ.30కోట్ల నిధులు త్వరలోనే విడుదల చేస్తాం. సీఎం కేసీఆర్‌ రాక ముందు చెరువు, సాగునీరును ఎవరూ పట్టించుకోలేదు. రైతాంగం కరెంటు రాక ఆకాశం వైపు చూసుకుంటే ఉండే పరిస్థితుల్లో.. అప్పులపాలై సచ్చిపోయినా ఎవరూ పట్టించుకోలే. కేసీఆర్‌ వచ్చాక ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన చేశారు. వానాకాలం నాట్లు వేసే టైమ్‌ వచ్చిందంటే ఇవాళ మీ ఫోన్లు టింగు టింగుమని మోగుతలేవా? రైతుబంధు మీ ఖాతాల్లో పడుతలేదా? ఎకరం పొలం ఉంటే రూ.10వేలు వస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే రైతుబంధు కింద 88,591 మంది రైతులకు ఇప్పటికీ రూ.900కోట్లకుపైగా ఖాతాల్లో జమ చేశాం’ అని కేటీఆర్ తెలిపారు.