తనపై స్పీకర్ కు పిర్యాదు చేయడం ఫై షర్మిల కామెంట్స్

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌పై ప‌లువురు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పాద‌యాత్ర‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ష‌ర్మిల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు ఆరోపించారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త విమర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల త‌మ ప్రతిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ పిర్యాదు పట్ల షర్మిల స్పందించారు. తాను విధానపరంగా విమర్శించానని.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే తన ప్రసంగాలు కొనసాగాయన్నారు. సీఎం కేసీఆర్‌ పై ఎన్నో విమర్శలు చేశానని ..అప్పుడు గమ్ముగా ఉన్న ఎమ్మెల్యేలు.. తమపై విమర్శలు వస్తేనే స్పందిస్తారా..? అని షర్మిల నిలదీశారు. సీఎంను విమర్శిస్తే వీరికి ఓకేనా..? అని ప్రశ్నించారు. స్పీకర్ తనపై ఎలాంటి చర్యలు తీసుకోరని విశ్వసిస్తున్నానన్నారు.