కాకినాడ జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం : ఏడుగురు మృతి

కాకినాడ జిల్లా పెద్దాపురం (మం) జీరాగంపేటలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగగా..ఈ ప్రమాదం లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో జారిపడిన మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేసేందుకు ఒక కార్మికుడు తొలుత ట్యాంకర్ లోకి దిగాడు. ఆ తర్వాత అతని కోసం మరో ఇద్దరు ట్యాంకర్ లోకి దిగారని స్థానికులు చెబుతున్నారు. విడతలుగా ఆయిల్ ట్యాంకర్ లోకి వెళ్లినవారంతా మృతి చెందారు. ఇవాళ ఉదయం ఆరు గంటలకే విధులకు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఆయిల్ లోడింగ్, అన్ లోడింగ్ చేసిన తర్వాత ట్యాంకర్ ను శుభ్రం చేస్తారు. ఆయిల్ ట్యాంకర్ ను కార్మికులు శుభ్రం చేసే సమయంలో పేలుడు చోటు చేసుకందని స్థానికులు చెబుతున్నారు. ఆయిల్ ట్యాంకర్ ను బద్దలు కొట్టి మృతదేహలను వెలికి తీశారు.

ఉదయం షిప్ట్ లో 70 నుండి 100 మంది విధులు నిర్వహిస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఏ విభాగంలో ఎవరు పనిచేయాలనే దానిపై కార్మికులకు విధులు కేటాయించారు. ట్యాంకర్ శుభ్రం చేసే విధులు చేయాల్సిన కార్మికులు ట్యాంకర్ లోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.