ఎమ్మెల్యే సీతక్క మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు

ఎవరైనా ఆపదలో ఉన్న , ఎలాంటి విపత్తు ఎదురైనా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చే వ్యక్తి ఎమ్మెల్యే సీతక్క. రాజకీయాలతో సంబంధం లేకుండా తనవంతు సహాయ సహకారాలు అందజేస్తుంటుంది. సాయం అందించేందుకు కొండ, గుట్టలను సైతం లెక్కచేయకుండా జోరు వర్షం లోనైనా సాయం చేస్తుంటుంది. అందుకే ఆమెను ప్రజల మనిషి అంటుంటారు. అలాంటి సీతక్క మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు పలు ప్రాజెక్ట్ లు పొంగిపొర్లడం తో ముంపు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో వారంతా తినేందుకు తిండి లేక , తాగేందుకు మంచి నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సీతక్క వారికీ సాయం చేసేందుకు కదం తొక్కింది.

ములుగు నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆ గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్లు కూలిపోయి ఎందరో నిరాశ్రయులయ్యారు. తల దాచుకోవడానికి కూడా అవకాశం లేదు. వారికోసం నిత్యావసర సరకులు, ఆహారం పంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏర్పాట్లు చేశారు. రెండు వాహనాల్లో ఆహార పధార్థాలను నింపి, పేదలకు పంపిణీ చేయడానికి పంపారు. కొన్ని గ్రామాల్లో తానే దగ్గరుండి ఆహారం అందించారు.

వర్షాలతో ఇబ్బందులు పడుతున్నవారికి, వరదల కారణంగా నష్టపోయిన వారికి సాయం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఎందరో పేదలు కనీసం ఆహారం కూడా లేక అలమటిస్తున్నారని, చేయిచేయి కలిపి వారందరినీ ఆదుకోవాలని కోరారు. తాను ఇప్పటికే నిత్యావసర సరకులు, ఆహారం పంపిణీ చేస్తున్నానని వెల్లడించారు. అవకాశం ఉన్న వారందరూ సాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.