దేశ సంపదను కేంద్రం దోచుకుంటుంది – ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఎనిమిదేళ్లుగా దేశ సంపదను కేంద్రం దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఆదివారం ములుగు జిల్లాలోని గోవిందరావు పేటలో ఆజాదీ కా గౌరవ యాత్రను సీతక్క చేపట్టారు. ఇందులో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బి.ఎస్.ఎన్.ఎల్, ఎల్.ఐ.సి, విశాఖ ఉక్కు పరిశ్రమలను, రైల్వే విభాగాన్ని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛను అందించి మువ్వన్నెల జెండాను ఎగురవేసింది కాంగ్రెస్ పార్టీ అని సీతక్క తెలిపారు.