భారత్‌కు చేరిన మరో 3 రఫేల్‌ యుద్ధ విమానాలు

బుధవారం రాత్రి జామ్ నగర్ కు చేరిక

Second batch of three Rafale fighter jets arrive in India

న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలో మరో మూడు రఫేల్‌ యుద్ధవిమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి రెండో విడత రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. మూడు ఫైటర్ జెట్స్ మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణించి, గుజరాత్ లోని జామ్ నగర్ లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బుధవారం రాత్రి 8.14 గంటల సమయంలో రెండో బ్యాచ్ రాఫెల్ విమానాలు ఇండియాకు చేరాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విమానాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్, మార్గమధ్యంలో గాల్లోనే నింపిందని వాయుసేన ప్రకటించింది. ఫ్రాన్స్ లోని ఇస్ట్రీస్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఇవి 8 గంటలకు పైగా ప్రయాణించాయని, మొత్తం 3,700 నాటికల్ మైళ్ల దూరాన్ని ఇవి ప్రయాణించాయని తెలిపింది.

కాగా, ఈ మూడింటితో కలిపి మొత్తం 8 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు వాయుసేన అమ్ములపొదిలో ఉన్నట్లయింది. మొత్తం రూ. 59 వేల కోట్లతో 36 విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు చైనాతో, మరోవైపు పాకిస్థాన్ తో సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ విమానాలు మరింత బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, కొత్తగా విమానాలు రావడంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేనకు అభినందనలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/