కాసేపట్లో నాంపల్లి కోర్టుకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్

మహమ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. రాజాసింగ్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజాసింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో నిన్న రాత్రి నుంచి ఓ వర్గం వారు పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.

దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి ఆందోళనకారులను అదుపు తప్పకుండా చేశారు. అయితే ఫిర్యాదులు కూడా అందడంతో వెంటనే రాజాసింగ్ ఇంటికెళ్లి అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాజాసింగ్ ను బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు.

మరోపక్క రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల ఫై బిజెపి అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్న ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది.