అదానీ అంశం..15న ఆర్థిక మంత్రి సీతారామన్ తో సెబీ అధికారుల భేటీ

అదానీ గ్రూపు కంపెనీలపై సమాచారంతో నివేదిక

sebi-to-update-fm-sitharaman-on-adani-probe-this-week-report

న్యూఢిల్లీః అదానీ గ్రూప్ వ్యాపార సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సెబీ ఈ వారంలోనే ఓ నివేదిక సమర్పించనుంది. అదానీ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై స్తంభనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో సెబీ ఇచ్చే నివేదికకు ఎంతో ప్రాధాన్యం నెలకొంది.

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ షేర్లు పడిపోవడం తెలిసిందే. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోని విరమించుకుంది. దీని పూర్వాపరాలపై సెబీ సమాచారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 15న సెబీ ఉన్నతాధికారుల బృందం ఆర్థిక మంత్రితో భేటీ కానుంది. ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనం సమయంలో తీసుకున్న అదనపు నిఘా చర్యల గురించి వివరించనున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, విదేశాల్లో ఉన్న అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ కంపెనీల నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లోకి వచ్చిన నిధుల అంశంపైనా సెబీ వివరాలు సమర్పించనున్నట్టు తెలిపాయి.