భారత్‌పై ప్రపంచానికి ఎంతటి నమ్మకం ఉందో స్పష్టమవుతోందిః ప్రధాని

మరిన్ని అవకాశాలకు ఎయిర్ షో రన్ వేగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్య

PM Modi inaugurates Aero India 2023 in Bengaluru, Karnataka

బెంగళూరు: ఆసియాలోనే అతి పెద్ద వైమానిక ప్రదర్శన సోమవారం ప్రారంభమైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ‘ఏరో ఇండియా-2023’ షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో పలు విమాన విన్యాసాలను మోడీ వీక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..ఈ షో మరెన్నో అవకాశాలకు రన్ వేగా మారుతుందని వ్యాఖ్యానించారు. ‘‘నవ భారత శక్తిసామర్థ్యాల ప్రదర్శనకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ఓ పరీక్ష. ఈ ప్రదర్శనలో 100 దేశాలు పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ప్రపంచానికి ఎంతటి నమ్మకం ఉందో స్పష్టమవుతోంది’’ అని మోడీ అన్నారు.

ద రన్ వే టూ ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఈ ఎయిర్ షోలో రక్షణ, వైమానిక రంగానికి చెందిన 809 మంది ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, హెచ్‌సీ రోబోటిక్స్ తదితర అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టాయి.

ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చైధరి కూడా పాల్గొన్నారు. ఆయన స్వయంగా యుద్ధ విమానాన్ని నడుపుతూ ‘గురుకుల్’ విన్యాసానికి నేతృత్వం వహించారు. ఈషోలో భాగంగా భారతీయ విదేశీ కంపెనీల మధ్య 251 ఒప్పందాలు జరగొచ్చని అంచనా. తద్వారా భారత్‌లోకి 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.