విద్యార్థులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పుస్తకాల మోత

పసి పిల్లలు తమ స్థాయికి మించి బరువున్న స్కూల్ బ్యాగ్ లను మోయడం అందరం చూస్తూనే ఉంటాం. వారి శారీరక ఆరోగ్యానికి అది మంచిది కాదని తెలిసినా కూడా పేరెంట్స్ ఏమీ చేయలేని పరిస్థితి. భవిష్యత్ బాగుంటాలంటే.. ఆమాత్రం బరువులు మోయక తప్పదని భావించి సరిపెట్టుకుంటారు. పోనీ స్కూళ్ల తరపున ఏమైనా ప్రయత్నం చేయొచ్చు కదా అంటే అది కుదరని పని. ఎన్ని ఎక్కువ పుస్తకాలిస్తే అంత మంచి స్కూల్, అంత పెద్ద స్కూల్. ప్రైవేటు వ్యవహారం అలాగే ఉంటుంది.

అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM ఉండగా, తాజాగా 200GSMకు తగ్గించారు. దీంతో ఒకటో తరగతి బుక్స్ బరువు 1.991 KGల నుంచి 1.40KGలకు, టెన్త్ క్లాస్ పుస్తకాల బరువు 5.373KGల నుంచి 4.193KGలకు తగ్గనుంది.