నేడు అనంతపురంలో కాంగ్రెస్ బహిరంగసభ

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈరోజు అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈరోజు జరిగే సభలో మేనిఫెస్టోను (Manifesto) విడుదల చేయనున్నట్లు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేదని రుద్రరాజు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలను జయప్రదం చేయాలని ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నట్లు రుద్రరాజు స్పష్టం చేశారు. సభలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హౌదా, విభజన హామీలు అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం అలాగే వంటగ్యాస్‌ కేవలం 500 రూపాయలకే అందజేయడం, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు రుణమాఫీ పథకాన్ని కల్పిస్తూ రాష్ట్రంలో ప్రస్తుత పథకాలాన్ని కొనసాగిస్తూ తదితర అంశాలపైన ప్రసంగం ఉంటుందన్నారు.