పాఠశాల వార్షికోత్సవాలా?సినిమా ప్రమోషన్లా?

Students in College Anniversary
Students in College Anniversary

మా ర్చి నెల వచ్చిందంటే ప్రతిపాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించడంలో తలమునకలైపోతుంటాయి. ప్రభుత్వ పాఠశాలలు ఇందుకు మినహాయింపు అనుకోండి. ఎందు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి ఆర్థికసహాయం చేయదు. పోనీ విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసి పండుగ చేద్దామనుకున్నా అక్కడ చదివే పేద పిల్లలు, ఇచ్చే పది, ఇరవైలతో పెద్దఎత్తున వార్షికోత్సవం జరపడం అసలే సాధ్యంకాదు. కేవలం ప్రైవేట్‌ పాఠశాలల్లోనే పెద్దఎత్తున సినిమా ఫంక్షన్లలా, వార్షికోత్సవాలను నిర్వహించడం జరుగుతోంది. కొన్ని పేరున్న పాఠశాలల్లో వార్షికోత్సవాల కోసం లక్షలు కుమ్మరిస్తున్నారంటే ఏస్థాయిలో వీటిని నిర్వహిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బంతా పాఠశాల యాజమాన్యాలు భరిస్తున్నాయంటే పప్పులో కాలేసినట్లే. వార్షికోత్సవం కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి విద్యార్థుల నుండి వసూలు చేసినవే. ఒకప్పుడు పాఠశాల వార్షికోత్సవాలంటే ప్రతి తరగతిలో చదువ్ఞలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, క్రీడలు, కళ, సాంస్కృతిక అంశాలలో ప్రతిభ కనపర్చిన వారికి బహుమానాలను ప్రదానం చేయడానికి డి.ఇ.ఓ స్థాయి అధికారులను విద్యారంగంలో లబ్ధిప్రతిష్టులను లేదా శాస్త్రవేత్తలను ఆహ్వానించేవారు. వారి ఉత్తేజకరమైన ప్రసంగాలలో స్ఫూర్తిపొంది విద్యార్థులు వారంతా గొప్పగా ఎదగాలని భవిష్యత్తులో పాఠశాలల యాజమాన్యాలు ఆశించేవి. కానీ కాలం మారింది. పాఠశాల వార్షికోత్సవం అంటే ఒక వాణిజ్య ప్రచార కార్యక్రమంలా తయారయింది. పేరున్న పాఠశాలలన్నీ వార్షికోత్సవాలకు చోటామోటా నటులను రాజకీయ నాయకులను అతిధులుగా తీసుకురావడం జరుగుతోంది. సినిమా నటుల ద్వారా జనాన్ని ఆకట్టుకుని పాఠశాల ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తైతే, రాజకీయ నాయకుల ద్వారా తమకు కావలసిన పనులు చేయించుకోవడం మరో ఎత్తు. పాఠశాల యాజమాన్యాల తెలివి తేటలను గ్రహించిన నటులు కూడా వార్షికోత్సవానికి షాపింగ్‌ మాల్స్‌, నగల దుకాణాల ప్రారంభానికి, పాఠశాల వార్షికోత్సవానికి పెద్ద తేడా లేకపోవడంతో కాస్త పేరున్న వారైతే లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. పేరులేని నటీనటులు, రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరవ్ఞతామని హాజరవ్ఞతూ వ్ఞంటారు. అసలు ఈ సినీనటుల నుంచి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలని వీరిని వేదికలెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక రాజకీయ నాయకుల సంగతి సరేసరి. ఏ వేదికపైనైనా ఒకటే ప్రసంగం. అది వారి పార్టీ ప్రయోజిత కార్యక్రమంలా మారుస్తారు. ఇటువంటి వారిని అతిథులుగా ఆహ్వానించే బదులు ఒక మంచి కళాకారుణ్ణి కానీ, ఒక శాస్త్రవేత్తను కానీ ఆహ్వానిస్తే వారు ఆ స్థితికి రావడానికి ఎన్ని ముళ్లదారులు తొక్కారో, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారో వివరిస్తే విద్యార్థులలో మనోనిబ్బరం పెరుగుతుంది. ఈ మధ్య ఒకపాఠశాల వార్షికోత్సవాన్ని ఒక ‘థీమ్‌ ఆధారంగా చేసుకొని నిర్వహించింది. భారతీయ క్రీడాకారులు అనే అంశం ఆధారంగా విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల వరకు వివిధ క్రీడలకు చెందిన దుస్తులు ధరించడం, క్రీడారంగంలో పేరున్న వ్యక్తుల కటౌట్లను ప్రదర్శించడం, ముఖ్య అతిథిగా ఒక ప్రముఖ క్రీడాకారుడ్ని ఆహ్వానించడం చాలా కొత్తగా ఉంది. వార్షికోత్సవాలను కూడా వ్యాపారం కింద మార్చుకునే పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి పాటల్లోనూ, డాన్సుల్లోనూ నాటకాల్లోనూ చోటు కల్పిస్తున్నారు. వాటికి తగినంత శిక్షణ అవసరమని, శిక్షణ కోసం తల్లిదండ్రుల నుండి ఎక్కువ మొత్తాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డాన్సుల్లో నాటకాల్లో ప్రత్యేక దస్తుల కోసం మళ్లీ అదనపు మొత్తం వసూలు చేయడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు కూడా ఏదో విధంగా తమ పిల్లవాడు వార్షికోత్సవ వేదిక మీద కనపడితే చాలు అని ఎంత మొత్తమైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఎక్కువ పాఠశాలల్లో వార్షికోత్సవ వేడుకల్లో రికార్డింగ్‌ డాన్సులే అధికంగా ఉంటున్నాయి. పండుగల్లో, జాతర్లలో పొట్ట కూటి కోసం చేసే రికార్డింగ్‌ డాన్సులను అశ్లీలం పేరుతో ప్రభుత్వాలు నిషేధిస్తూ ఆ కళాకారుల పొట్టకొడుతోంది. మరి అభంశుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్న పిల్లల చేత అటువంటి నృత్యాలు చేయించే పాఠశాలలను ప్రభుత్వాలు ఎందుకు నిషేధించవ్ఞ.సర్కస్‌లో జంతువ్ఞలను హింసించి, శిక్షణ ఇచ్చి ఆట లాడించడం నేరమని అటు ప్రభుత్వాలు, ఇటు జంతుప్రేమికుల సంఘాలు ఘోషిస్తున్నాయి. కానీ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యనున్న చిన్న పిల్లల చేత నృత్యాలు చేయించే పాఠశాల యాజమాన్యాలకు ఏ శిక్షలు వేయాలో ఆలోచించవ్ఞ. ఐదు నిమిషాల నృత్యం చేయాలంటే సినిమా నటులు టేకుల మీద టేకులు తీసుకుంటూ ముక్కలు ముక్కలుగా ఆ నృత్యాన్ని పూర్తి చేస్తారు. అటువంటిది అభంశుభం తెలియని అమాయక పసిపిల్లలను ఐదు నిమిషాల ప్రోగ్రాం కోసం గంటల తరబడి శిక్షణనిస్తూ శారీరకంగా హింసించడం ఎంతవరకు సబబు. కేవలం పాఠశాలల ప్రచారం కోసం నిర్వహించే వార్షికోత్సవాలలో చిన్నారులను బలిపశువ్ఞలుగా చేస్తున్నామనే నిజాన్ని అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యాలు మరిచిపోతున్నారు. ఇటువంటి నృత్యాల వల్ల పరోక్షంగా చిన్న పిల్లల్లో వయసుకు మించిన ఆలోచనలను ప్రవేశపెడుతున్నామని గ్రహించలేక పోతున్నారు. చిన్నారులలో సాకారాత్మకమైన భావాలను నాటిన ప్పుడే భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా మారుతారు. విత్తు మంచిదైతే చెట్టు మంచిదవ్ఞతుంది. ఇకనైనా పాఠశాలల యాజమా న్యాలు కేవలం వ్యాపార దృక్పథంతో వార్షికోత్సవాలను, సినిమా పండుగలుగూ నిర్వహించకుండా, చిన్నారుల ఆనందోత్సవాలను, అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని నిర్వహించాలి.

  • ఈదర శ్రీనివాసరెడ్డి

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/