ముఖంపై మచ్చలు పోవాలంటే…

Scars on the face…

నల్ల మచ్చలు రావడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా చర్మానికి రంగునిచ్చే మెలనిన్‌ శరీరంపై కొన్ని చోట్ల అధిక స్థాయిలో పేరుకుపోతుంది. ఆ భాగాల్లోనే ఈ సమస్య ఎదురవుతుంది. దీంతోపాటు గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్‌ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులతోనూ మచ్చలు ఏర్పడతాయి. ఎండ, పొడిబారిన చర్మము దీనికి కారణమే. ఈ సమస్యలకు మొదటి పరిష్కారం మంచినీళ్లే. రోజుకి 10 గ్లాసు నీరు తాగుతూనే, గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజువారి ఆహారంలో పండ్లు భాగం కావాలి. మసాలా, కారం తగ్గించి కమ్మగా, చేదుగా ఉండే కూరలను ఎక్కువగా తినాలి.
ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూచనలతో చర్మం రంగు మారే సమస్య అదుపులో ఉంటుంది. చెంచా చొప్పున సుగంధ పాల చూర్ణం, పటిక బెల్లాన్ని కప్పు పాలతో కలిపి తాగాలి. అరచెంచా చొప్పున మంజిష్ట చూర్ణం, చందనం చూర్ణానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు సార్లు తినాలి. వీటన్నింటినీ కనీసం 10 నుంచి 12 నెలల పాటు వాడితేనే ఫలితం ఉంటుంది.
కప్పు నీటిలో అరచెంచా చొప్పున వట్టివేళ్లు, ఖర్జూరాల చూర్ణం వేసి 12 గంటలు నాననిచ్చి రెండు పూటలా తీసుకోవాలి. పుల్లని పెరుగులో బార్లీ పిండిని కలిపి ముద్దలా చేసి మచ్చలపై లేపనంగా పూయాలి. పదిహేను నిమిషాల తరువాత కడగాలి. ఇలా రోజూ చేయాలి. నిద్రపోయే ముందు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను మచ్చలున్నచోట రాసుకుని మర్నాడు కడిగేయాలి. టొమాటో రసాన్ని మచ్చలపై రాసి అరగంగా తరువాత కడగాలి.
ఇలా రెండు రోజులకొకసారి చేయాలి. కలబంద గుజ్జుని లేపనంలా వేసుకుంటే ఈ సమస్య అదుపులో ఉంటుంది. కొబ్బరి నూనెను సమస్య ఉన్నచోట రాసి గంట తరువాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. రోజు ఇలా చేస్తే మచ్చల సమస్య చాలా మటుకూ తగ్గుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/