బాలీవుడ్ నటుడు స‌మీర్ క‌క్క‌ర్ మృతి

బాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు స‌మీర్ క‌క్క‌ర్ (71) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న శ్వాస సంబంధ స‌మస్య‌ల‌తో బాధపడుతున్నాడు. నాలుగు ద‌శాబ్ధాలుగా నటుడిగా రాణిస్తున్న ఆయన… 1996 నుంచి అమెరికాలో స్ధిర‌ప‌డ‌గా ఇటీవ‌ల దేశానికి తిరిగి వ‌చ్చారు.

గుజ‌రాతీ నాట‌కాల‌తో పేరొందిన స‌మీర్ క‌క్క‌ర్ టీవీ షో నుక్క‌డ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ షోతో ఆయ‌న ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స్ధిర‌ప‌డ్డారు. స‌ర్క‌స్‌, న‌యా నుక్క‌డ్‌, శ్రీమాన్ శ్రీమ‌తి, మ‌ణిరంజ‌న్‌, అదాల‌త్ వంటి టీవీ షోలు ఆయ‌న‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ఇక ఆయ‌న హ‌సీ తో ఫ‌సీ, ప‌టేల్ కో పంజాబీ షాదీ, పుష్క‌క్‌, ప‌రింద‌, ష‌హెన్‌షా వంటి సినిమాల్లోనూ స‌మీర్ క‌క్క‌ర్ క‌నిపించారు. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ‌ర్జి, జీ5 స‌న్‌ఫ్ల‌వ‌ర్‌, సుధీర్ మిశ్రా సీరియ‌స్ మెన్ షోల్లోనూ ఆయ‌న న‌టించారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.