పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్‌ రేవంత్..

ప్రముఖ సింగర్‌ రేవంత్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. అన్విత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమయంలో కాబోయే భార్యతో ఉంగరాలు మార్చుకున్నాడు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్ చేసాడు. దీంతో పలువురు నెటిజన్లతో పాటుగా సెలబ్రిటీలు రేవంత్‌‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా అన్విత గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో వందలాది పాటలు పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు.

రేవంత్ విషయానికి వస్తే..ఏపీలోని శ్రీకాకుళం అతని స్వస్థలం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. చదువుకునే సమయంలో సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. పలు మ్యూజిక్‌ కాంపీటీషన్స్‌లో పాల్గొని సత్తా చాటాడు. తెలుగు ఛానెల్స్ మ్యూజిక్‌ రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నాడు. ఈక్రమంలోనే ఇండియన్‌ ఐడల్‌-9 టైటిల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడలోనూ మంచి ప్లే బ్యాక్‌ సింగర్‌గా గుర్తింపు పొందిన రేవంత్‌ ఇప్పటివరకు దాదాపు 200కు పైగా పాటలు ఆలపించాడు.