స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు

తెలిపిన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం
నవంబరు 1 నుండి ఉన్నత విద్యాకళాశాలల ప్రారంభం

Sabitha Indra Reddy

హైదరాబాద్‌: ఈనెల 15 నుండి తెలంగాణలో పాఠశాలలు తెరవడం సాధ్యం కాదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై ఉపసంఘం నిన్న ఉన్నతాధికారులతో సమావేశమైంది.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచేదీ దసరా తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా నవంబరు 1 నుంచి ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు మాత్రం తెరుస్తామన్నారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 50 శాతం మంది విద్యార్థులు ఒకరోజు తరగతులకు హాజరైతే మిగతా వారికి ఆన్‌లైన్ ద్వారా బోధించాల్సి ఉంటుందని మంత్రి సబిత పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన తప్పనిసరి అని స్పష్టం చేశారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందరికీ ఉపయోగపడేలా, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని, అది ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

పాఠశాలల పునఃప్రారంభం విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో ఫోన్లు, సరైన సిగ్నల్స్ లేని కారణంగా వారికి విద్య అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో నిబంధనలు ఒకేలా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/