బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసన పట్ల మంత్రి సబితా కీలక సమావేశం

బాసర ఆర్జీయూకేటీలో రెండో రోజు విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సౌకర్యాల కొరత, యాజమాన్యం నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 6వేల మంది విద్యార్థులు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలో కేటీఆర్ ..రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. అయినప్పటికీ విద్యార్థులు తమ నిరసనను ఆపలేదు.

విద్యార్థి నాయకులతో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ చర్చించారు. కలెక్టర్‌ ముందు ఆర్జీయూకేటీ విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్న కలెక్టర్‌… మిగతా అంశాలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఆర్జీయూకేటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని, బాసర ఆర్జీయూకేటీని సీఎం సందర్శించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. డిమాండ్లపై హామీ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొంటున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చల సారాంశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు.