రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​కు నిరసనల సెగ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు నిరసనల సెగ ఎదురైంది. పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు యువకులు మంత్రి కాన్వాయ్​ను అడ్డుకునేందుకు యత్నించారు. కేటీఆర్ డౌన్​ డౌన్​ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. మంత్రి కాన్వాయ్​లో వెళ్తున్న కార్ల వెంట పరుగులు తీశారు. కాన్వాయ్​ను అడ్డుకునేందుకు యత్నించిన యువకులుదీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. మినీ స్టేడియం, డిగ్రీ కాలేజీ ,30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ముస్తాబాద్​లో మంత్రి కేటీఆర్​ను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.