నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీ.. మరోసారి రష్యా బాంబుల దాడి

Russia bombs Ukrainian city flooded from bombed dam

కీవ్‌ః మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడింది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని కఖోవ్‌కా డ్యామ్‌ను పేల్చేయడంతో ఆ డ్యామ్‌ కింద ఉన్న నగరం నీట మునిగింది. ఇప్పుడు ఆ నగరమే లక్ష్యంగా రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇప్పటికే జనాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ నగరం పూర్తిగా ధ్వంసమైపోతున్నది.

డ్యామ్‌ను పేల్చిన వెంటనే వరదనీరు నగరంలో ప్రవేశించింది. దాంతో ఆ నగర ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఉక్రెయిన్‌ సైన్యం కూడా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తలరించింది. అయినా 14 మంది వరదల్లో కొట్టుకుపోయారు. వేల మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. డ్యామ్‌లో నీరంతా పోవడంతో లక్షల మందికి తాగునీటి కటకట ఏర్పడింది.

రష్యా సేనలు కఖోవ్‌కా డ్యామ్‌ను మాత్రమేగాక ఆ డ్యామ్‌ కింద ఉన్న జలవిద్యుత్‌ డ్యామ్‌ను కూడా పేల్చేశాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ ఆరోపించారు. అంతేగాక రష్యా బలగాలు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన జపోరిఝ్ఝియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాలపై కూడా దాడులను కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు.