అద్దంకిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించాకే రేవంత్ సారీపై ఆలోచిస్తాః కోమ‌టిరెడ్డి

venkat reddy komatireddy

హైదరాబాద్ః కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా త‌ద‌నంత‌రం తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌రుస‌గా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప‌రిధిలోని చండూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలోనే భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై పార్టీ కీల‌క నేత అద్దంకి ద‌యాక‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై వెనువెంటనే స్పందించిన పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అద్దంకికి నోటీసులు జారీ చేయ‌గా… ఆ వెంట‌నే అద్దంకి సారీ చెప్పారు.

అయితే త‌న‌ను కావాల‌నే పార్టీ నేత‌ల‌తో తిట్టించార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపిస్తూ… టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌కు సారీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కోమ‌టిరెడ్డి డిమాండ్ మేర‌కు రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెబుతూ శ‌నివారం ఉద‌యం ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోపై తాజాగా స్పందించిన కోమ‌టిరెడ్డి… త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అద్దంకి ద‌యాక‌ర్‌ను పార్టీ నుంచి శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించిన త‌ర్వాతే రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ‌పై ఆలోచిస్తాన‌ని అన్నారు. ఉద్య‌మ‌కారుడినైన త‌న‌ను సొంత పార్టీ నేత‌లు అవ‌మానించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/