సగ్గు బియ్యం పొంగనాలు

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Ponganaalu
Ponganaalu

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం – ఒక కప్పు, బంగాళాదుంపలు – 2, వేగించిన పల్లీలు – అరకప్పు, పచ్చిమిర్చి – మూడు, పసుపు – పావు టీ స్పూన్‌, కారం అర టీ స్పూన్‌, జీలకర్ర – ఒక టీ స్పూన్‌, అల్లం – అంగుళం ముక్క, కరివేపాకు – నాలుగు రెబ్బలు, నిమ్మరసం – అరచెక్క, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – మూడు టేబుల్‌ స్పూన్‌లు

తయారు చేయు విధానం:

సగ్గుబియ్యం శుభ్రం చేసి మునిగే వరకు నీరు పోసి 4 గంటలు నానబెట్టాలి. పల్లీలను బరకగా మిక్సీ పట్టాలి.

అదే మిక్సీ జారులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి నీరుపోయకుండా బరకగా పేస్టు చేసుకోవాలి.

ఉడికించిన బంగాళాదుంపలు తొక్కతీసి మెదపాలి.

ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌లో నీరు వడకట్టిన సగ్గుబియ్యం, బంగాళాదుంప గుజ్జు, పల్లీ బరక, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు తరుగు, నిమ్మరసం వేసి ముద్దగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కనుంచాలి. ఇప్పుడు పొంగనాల పెనం గుంతల్లో నూనె రాసి ఒక్కో ఉండని గుంతల్లో ఉంచి చిన్నమంటపై వేగించాలి.

రెండోవైపు తిప్పినప్పుడు గుంతల్లో నూనె చుక్కలు వదలాలి. అన్నివైపుల వేగిన తర్వాత తీసి, వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/