‘ఆరా’ సర్వేపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల చర్చలు జరుగుతున్న వేళ…తాజాగా ‘ఆరా’ సర్వే బయటకు రావడం..ఆ సర్వే లో టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం, ఇతరులకు 6.93 శాతం ఓట్లు వస్తాయని పేర్కొనడం తో మరింత చర్చగా మారింది. ఈ సర్వే ఫై టీఆర్ఎస్, బీజేపీ సానుకూలంగా ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

తాజాగా ఈ సర్వేపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ చిల్లర మైండ్ గేమ్స్ చూస్తే నవ్వొస్తుంది. ఆరా మస్తాన్, ఎందరిని ఏం అడిగిండో నాకు తెలవదు కానీ, ఇప్పటికీ 104 రోజులు దాదాపుగా 15000 కిమీ ప్రయాణం,760 పైగా గ్రామాలు తిరిగి చెప్తున్న, ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా మీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మైండ్ బ్లాక్ అవుడు ఖాయం. మా సవాల్‌కు సిద్ధంగా ఉండండి.” అంటూ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ..తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆరు శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరుగుదల మామూలు విషయం కాదన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. ప్రజలు మా పోరాటాలను గమనిస్తున్నారు అని అన్నారు.