ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కరోనా పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ జాబితాలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. అయితే కొంతమంది ఈ కరోనా బారి నుండి కోలుకోగా, మరికొంత మంది మృతి చెందారు. తాజాగా కరోనా బారిన పడిన వారిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఉన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు 70 ఏళ్ల వయసు ఉండటంతో, కరోనా చికిత్సతో పాటు జనరల్ చెకప్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఆయనకు సాధారణ కరోనా లక్షణాలు కనిపించాయని, అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని, త్వరలోనే ఆయన కరోనాను జయిస్తారని ఆర్ఎస్ఎస్ సభ్యులు అంటున్నారు.

ఏదేమైనా కరోనా నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తోంది. ఇక మోహన్ భగవత్‌కు కరోనా సోకిందనే వార్తతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో కోరుకున్నారు.