అగ్నిపథ్ పథకంపై వచ్చే వారం విచారణకు సుప్రీం అంగీకరం

త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి

supreme court
supreme court

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాక తగిన ధర్మాసనం​ ఈ పిటిషన్లపై వాదనలు వింటుందని వెకేషన్ బెంచ్ సోమవారం తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకంతో ఎయిర్​ ఫోర్స్​ ఔత్సాహికుల కెరీర్​ను 20 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు కేంద్రం తగ్గించిందని ఓ పిటిషనర్ తన వ్యాజ్యంలో ఆరోపించారు.

“కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘అగ్నిపథ్’ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనేది నా విజ్ఞప్తి. 70వేల మందికి పైగా యువత అపాయింట్‌మెంట్ లెటర్‌లు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకంతో వారందరి కెరీర్​ 20 ఏళ్ల నుంచి నాలుగేళ్లకు తగ్గతుంది” అని పిటిషనర్​, న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్​లో పేర్కొన్నారు. త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టారు.

అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా యువత హింసాత్మక నిరసనలను చేపట్టిన నేపథ్యంలో రైల్వేతో సహా ప్రజా ఆస్తుల నష్టంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. హింసాత్మక నిరసనల రిపోర్టును సమర్పించాల్సిందిగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బిహార్, హరియాణా, రాజస్థాన్ ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోరారు. జాతీయ భద్రత, సైన్యంపై ఈ పథకం ప్రభావాన్ని పరిశీలించడానికి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు.

.తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/