ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మంత్రుల వ్యాఖ్యలు.. మాల్దీవుల రాయబారికి సమన్లు

MEA summons Maldivian envoy amid row over ministers’ remarks on PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత్‌ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్‌ ఇబ్రహిం శహీద్‌ సౌత్‌బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత్‌, ప్రధాని మోడీపై తమ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నది. సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్‌, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్‌, ప్రభుత్వ అధికారుల్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఎంపీలు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం ఆమోదనీయం కాదని, ఆ వ్యాఖ్యలు తమ ప్రభుత్వ, ప్రజల వైఖరిని ప్రతిబింబించవని మాల్దీవుల విదేశాంఖ శాఖ తెలిపింది.

కాగా, ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్టులో లక్షద్వీప్‌ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఇజ్రాయెల్‌ పప్పెట్‌గా అభివర్ణిస్తూ ఓ మంత్రి దుర్భాషలు చేశారు. భారత్‌ను ఆవు పేడతో పోల్చారు. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది.