జగన్ ఆటో జానీ గెటప్ అదుర్స్ అంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి సీఎం జగన్ ఫై సెటైర్లు వేశారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా.. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి నిధులు జమచేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడారు.

ఈ సభలో కాసేపు జగన్ ఆటోడ్రైవర్ గెటప్ లో కనిపించాడు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ RRR కామెంట్స్ చేసాడు. జగన్ ఆటో జానీ గెటప్ అదిరిందని, రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి, భాషా చిత్రంలో రజినీకాంత్ గారి మాదిరిగా ఆటో డ్రైవర్ పాత్రలో జగన్ ఒదిగిపోయారని, ముఖ్యమంత్రి పాత్ర కంటే ఆయనకు ఆటోడ్రైవర్ పాత్రే అద్భుతంగా ఉందని రఘురామకృష్ణ రాజు సెటైర్లు వేశారు. కార్మికుడైన ఆటో డ్రైవర్ డ్రెస్ కోడ్ ను ముఖ్యమంత్రి గారు నిత్యం కంటిన్యూ చేయాలని సూచించారు. కోర్టులకు కూడా వెళ్లకుండా పేదవాని కోసం కార్మికుడిలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని అన్నారు

విజయవాడలో నిర్వహించిన జగనన్న వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి సుమారు 15 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అయిన ఆర్థిక భారం కూడా ప్రజలపైనే పడునుందని, అంతకంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో సమావేశ ప్రాంగణానికి చేరుకొని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు మొత్తం 8,20,000 మంది ఉండగా, జగనన్న వాహన మిత్ర పథకంలో కేవలం రెండు లక్షల 50 వేల మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, అంటే మిగిలిన ఆటో డ్రైవర్లు, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు ధనవంతులై ఉంటారు కాబోలని కామెంట్స్ వేసాడు. ప్రస్తుతం RRR కామెన్స్ వైరల్ గా మారాయి.