మోడీతో రోజా సెల్ఫీ ..

అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు భీమవరం లో ఏర్పటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏపీ పర్యాటక మంత్రి రోజా మోడీ తో సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకుంది. అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ.. తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి పుట్టిన గడ్డ అంటూ కొనియాడారు.‘ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతానికి స్పూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనం అందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మాట్లాడారు. ఈ సభలో అల్లూరి వారసులను సన్మానించారు.

అలాగే ఆదివాసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అలాగే ‘‘పండ్రంగిలో అల్లూరి జన్మ స్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం, ఆంగ్లేయులకు ఎదురొడ్డి అల్లూరి నిలబడిన చింతపల్లి పోలీసు స్టేషన్, ధ్యాన మందిర నిర్మాణాలను చేపట్టి జాతికి అంకితం చేస్తాం’’ అని మోడీ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జీవితంతో ముడిపడిన ప్రాంతాల జీర్ణోద్ధరణకు కృషి చేస్తున్న వారిని ఈసందర్భంగా ప్రధాని అభినందించారు. ‘‘మనదే రాజ్యం నినాదంతో అల్లూరి సీతారామరాజు ఆనాడు ప్రజలను చైతన్యపరిచారు. ‘వందేమాతరం’ నినాదం కూడా ‘మనదే రాజ్యం’ నినాదంతో సరితూగేలా ఉంటుంది.

వేడుకలు ముగిసిన తర్వాత మంత్రి రోజా ప్రధాని మోడీతో సెల్ఫీ దిగారు. మోడీ స్టేజ్ నుండి దిగేసమయంలో ప్రధానిని ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్ అని రోజా అడగగానే మోడీ నవ్వుతూ ఒకే అన్నారు. వెంటనే రోజా ప్రధాని మోడీతో..పక్కనే ఉన్న జగన్ తో రోజా సెల్ఫీ దిగడంతో ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ప్రధాని మోడీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు.