మోడీ భీమవరం పర్యటనలో భద్రత లోపం..హెలికాప్టర్‌ కు ఎదురుగా బెలూన్లు

దేశ ప్రధాని పర్యటన అంటే ఎంత భద్రత ఉండాలి..కానీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరంకు హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల కొద్ది నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు. ఈ బెలూన్లు హెలికాప్టర్‌ కు దూరంగా గాల్లో ఉండడం తో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఒకవేళ హెలికాప్టర్‌ కు తగిలితే ఎలా..? ఏమైనా ప్రమాదం జరిగి ఉంటె..? మోడీ పర్యటిస్తున్న సమయంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భద్రత పోలీసులు ఏమైపోయారు..? వారి భద్రత ఏది..? అంటూ అంత మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల రాష్ట్ర పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణను ప్రారంభించారు.

భీమవరంలో అల్లూరి125 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలుగు ప్రజల మనసును దోచారు. అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ.. తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి పుట్టిన గడ్డ అంటూ కొనియాడారు.‘ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతానికి స్పూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనం అందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మాట్లాడారు. ఈ సభలో అల్లూరి వారసులను సన్మానించారు .