అమరావతిలో రోజాకు చేదు అనుభవం

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

Amaravati farmers dharna

తుళ్ళూరు : రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ సెమిస్టర్‌లో పాల్గొనేందుకు నగరి ఎమ్మెల్యే,ఏపిఐఐసీ చైర్మన్‌ రోజా గురువారం విచ్చేశారు.దీంతో రాజధాని రైతులు యూనివర్సిటీ చేరుకొని వైసీపీ ఎమ్మెల్యే రోజాను అటకాయించారు.యూనివర్సిటీ ప్రాంతంలో వేలాదిమంది రైతులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అక్కడినుంచి పోలీసుల సాయంతో రోజా పెద్దపరిమి గ్రామం వైపు వెళ్ళారు.ముందస్తు సమాచారం తెలుసుకున్న రైతులు పెదపరిమి వద్ద ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు.పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ మమ్మల్ని అవహేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని మహిళా రైతులు డిమాండ్‌ చేశారు. అమరావతికి జై.. కొట్టాలని నినాదాలు చేశారు.కారు నుండి ఎమ్మెల్యే రోజా కిందకు దిగిపోవడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే రోజా వాహనాన్ని ముందుకు వెళ్ళనీయకుండా రైతులు అడ్డంగా నిలుచున్నారు.రోడ్డును వాహనాలతో నింపి తక్షణమే రోజా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.అన్యాయం జరిగిందని రోడ్డెక్కితే పెయిడ్‌ ఆర్టిస్టులు అంటావా..అంటూ నిలదీశారు.రాజధానిపై రోజా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.దీంతో పాటుగా రాజధాని ప్రాంతమైన తుళ్ళూరులో బుధవారం నాడు వెంకటపాలెం సమీపంలో తహసీల్ధార్‌ను రైతులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులు సైతం రైతులపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో రాజధాని రైతాంగం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.తుళ్ళూరు రోడ్డుమీద కూర్చొని రైతులపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.పోలీసుల తీరుపై పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు లేదా అని ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని మహిళలు పెద్తఎత్తున నినాదాలు చేశారు.దోపిడీ రాజ్యం అని ప్రజారాజ్యం కాదని ఆందోళనకు దిగారు.

రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 65వ రోజుకు చేరుకున్నాయి.మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 100కార్లతో రాజధాని ప్రాంతం కూడలిగా విచ్చేసి రైతులకు సంఘీభావం ప్రకటించారు.అదేవిధంగా అనంతపురం నుండి బస్సు ద్వారా వందలాది మంది రైతులు రైతు శిక్షణా శిబిరాలు చేసుకొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

మహిళా కమిటీ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి పెదపరిమి రైతు దీక్షా శిబిరంలో కూర్చొని రైతులకు సంఘీభావం ప్రకటించారు.జై అమరావతి… జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న నినాదాలు మిన్నంటాయి.ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలసౌధం అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్మోహనరెడ్డి కుట్ర పన్నుతున్నారని రైతు నాయకులు ఆరోపించారు.అమరావతిని సాధించేంత వరకు విశ్రమించబోమని జేఏసి నాయకులు వెల్లడించారు.

రైతులపై పక్షపాత దోరణితో సీఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని అమరావతి రైతులు భూములిచ్చి రోడ్డుపై కూర్చొని దీక్ష చేస్తుంటే కనీసం కనికరం లేకుండా పోలీసులు రైతులను కొడుతున్నా…..మాట్లాడ్డం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.యధావిధిగా రాజధాని రైతు దీక్షలు కొనసాగుతాయని తుళ్ళూరు,రాయపూడి,పెదపరిమి గ్రామాల్లో వంటావార్పు కార్యక్రమాన్ని రైతులు నిర్వహించినట్లు తెలిపారు.అదేవిధంగా మందడం,వెలగపూడి గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/