ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident
Road accident

హైదరాబాద్‌ః శుభకార్యానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో ఓ లారీని ఢీ కొట్టి బోల్తా పడింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిందీ ఘోరం.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎర్రవల్లి మండల కేంద్రం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు..

ఏపీలోని ఆళ్లగడ్డకు చెందిన వెంకటేశ్ తన కుటుంబంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. కుటుంబంలో తలా ఓ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆళ్లగడ్డలో ఉంటున్న తన బావమరిది పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. శుభకార్యం పూర్తయ్యాక స్కార్పియోలో భార్య, పిల్లలు, తల్లితో కలిసి హైదరాబాద్ తిరుగు పయనమయ్యాడు. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న స్కార్పియో గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టి బోల్తా పడింది.

దీంతో వెంకటేశ్, ఆయన భార్య పుష్ప, తల్లి లత, మేనల్లుడు ఆదిత్య అక్కడికక్కడే చనిపోయారు. వెంకటేశ్ కొడుకు నందు, కూతురు తరుణి, అక్క కవితలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.