మలద్వారంలో బంగారం దాచిన ఎయిర్‌హోస్టెస్

ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికులపై నిఘా పెడుతుంటారు. విదేశాల నుంచి నిషేధిత వస్తువులను విమానాల్లో తీసుకువస్తున్న వారిని పట్టుకొని వారి దగ్గరి నుండి ఆయా వస్తువులను స్వాధీనం చేసుకొని జైలు కు తరలించడం చేస్తుంటారు. ఇప్పటి వరకు ప్రయాణికులు ఎక్కువగా పట్టుబడగా..తాజాగా ఎయిర్‌హోస్టెస్ పెద్ద మొత్తంలో బంగారం తో పట్టుబడి వార్తల్లో నిలిచింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు మస్కట్ నుంచి ఈ నెల 28 వ తేదీన ఓ విమానం వచ్చింది. అయితే ఆ విమానం నుంచి దిగిన సురభి ఖాతూన్‌ అనే ఓ ఎయిర్‌హోస్టెస్‌ వ్యవహారశైలి ఎయిర్‌పోర్టులోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం కలిగించింది. దీంతో ఆమెను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారికి విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ ఎయిర్‌హోస్టెస్.. తన మలద్వారంలో బంగారం దాచి తీసుకువచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ బంగారం బరువు దాదాపు కిలో ఉండటంతో అది చూసిన అధికారులు షాక్ అయ్యారు. సురభి ఖాతూన్‌ మలద్వారం నుంచి ఏకంగా 960 గ్రాముల బంగారాన్ని గుర్తించిన అధికారులు.. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సురభి ఖాతూన్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఆమెను కన్నూర్‌ మహిళా జైలుకు తరలించారు. అయితే ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారి అని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.