నేడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే

Mallikarjun Kharge to take charge as Congress president today

న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఆయనకు బాధ్యత‌లు అప్పగించనున్నారు. ప్రమాణ స్వీకర కార్యక్రమం కోసం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీతోపాటు సీడబ్ల్యుసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, సీఎల్పీ నాయకులు, మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులు హాజరవుతారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఈ నెల 17 ఎన్నికలు నిర్వహించారు. సీనియర్‌ నేతలైన మల్లికార్జున్‌ ఖర్గే, శశి థరూర్‌ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్‌పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు. ఆయనుకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కు 1072 ఓట్లు పోలయ్యాయి. మరో 416 ఓట్లను తిరస్కరించారు. గాంధీ కుటుంబం ఖర్గేకు మద్దతుగా నిలవడంతో ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో 24 ఏళ్ల త‌రువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖ‌ర్గే నిలువనున్నారు.

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మల్లికార్జున్‌ ఖర్గే.. బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మ‌హాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంత‌రం అక్కడినుంచి ఏఐసీసీ కార్యాల‌యానికి బ‌య‌లుదేరి వెళ్లారు.