పీసీసీ చీఫ్ పదవికే ఆయన ఒక సీఎంలా ఫీల్ అవుతున్నారుః మల్లారెడ్డి

డబ్బులు భిక్షమెత్తుకోవడానికే అమెరికాకు వెళ్లారని ఆరోపణ

malla reddy

హైదరాబాద్‌ః టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. తాజాగా రేవంత్ పై మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. రైతులకు ఉచిత కరెంట్ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి.

ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాట్లాడుతూ… రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పుట్టగతులు కూడా ఉండవని అన్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం భిక్షమెత్తుకోవడానికే రేవంత్ అమెరికాకు వెళ్లారని విమర్శించారు.

రేవంత్ ఒక దొంగ అని, దొంగకు పీసీసీ పగ్గాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. పీసీపీ చీఫ్ పదవి వస్తేనే ఆయన ఒక సీఎంలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల జోలికి వస్తే రేవంత్ కు పుట్టగతులు ఉండవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని… కెసిఆర్ రైతుల మేలు కోరే నాయకుడని చెప్పారు. బిఆర్ఎస్ అంటేనే రైతు సర్కార్ అని అన్నారు.