టీఎస్‌కు బదులు టీజీ.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్ ట్వీట్

Revanth Reddy responded to the cabinet’s decisions through social media

హైదరాబాద్ః రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రోజున జరిగిన ఈ భేటీలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర అధికార చిహ్నంలోమార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో TSను TGగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. తాజాగా ఇదే విషయంపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్‌ ప్రకటించినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ ఒక జాతి అస్థిత్వానికి చిరునామా భాష, సాంస్కృతులే వారసత్వంగా ఉంటాయని వివరించారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని వెల్లడించారు. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినాదించిన TG ని తీసుకురావాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. వాటిని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.