రాజ‌కీయ ప్ర‌చారం కోసం చిన్న పిల్ల‌ల‌ను వాడ‌కూడ‌దుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

Central Election Commission

న్యూఢిల్లీః నేడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. రాజ‌కీయ పార్టీల‌కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. రాజ‌కీయ ప్ర‌చారం కోసం పార్టీలు కానీ అభ్య‌ర్థులు కానీ చిన్న పిల్ల‌ల‌ను వాడ‌కూడ‌ద‌ని ఈసీ పేర్కొన్న‌ది. ర్యాలీలు, ప్ర‌చారం, ప్ర‌క‌టన‌ల్లో పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాల‌ని ఈసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీ ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన‌ట్లు తెలుస్తోంది. పోస్ట‌ర్లు, పాంప్లెట్ల పంపిణీ కానీ, నినాదాలు చేయ‌డానికి కూడా పిల్ల‌ల‌ను వాడ‌కూడ‌ద‌ని ఈసీ తెలిపింది. ర్యాలీల స‌మ‌యంలో త‌మ‌తో పాటు చిన్న పిల్ల‌ల‌ను తీసుకువెళ్ల‌రాదు అని పేర్కొన్న‌ది. ఈ నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఈసీ వెల్ల‌డించింది.

కాగా, త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆయా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తాయి. తమ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొందరు నాయకులు పిల్లలని ప్రచారంలో చేర్చుకుంటున్నారు. 18 ఏళ్ళ లోపు పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయిస్తూ లబ్ది పొందుతున్నారు. దీంతో పిల్లల ఆలోచన విధానాల్లో మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. బంగారు భవిష్యత్తున్న చిన్నారులు రాజకీయ సునామీలో కొట్టుకోకుండా అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి. చిన్న నాటి నుండి వారిలో లేనిపోని నెగటివ్ ఎనర్జీని సృష్టించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం సీరియస్ అయింది.