30 లక్షల మంది నిరుద్యోగులు కదనరంగంలోకి దిగితే ఇందిరమ్మ రాజ్యం వస్తుందిః రేవంత్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ

revanth-reddy- press-meet-at-Gandhi Bhavan

హైదరాబాద్‌ః తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే, అధికార పార్టీకి పోటీ బిజెపి అలాగే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ కెసిఆర్ ప్రొటెక్షన్ మనీ కింద తమకు ఇచ్చిన మొత్తాన్ని బిజెపి ఉపయోగించిందన్నారు. ఓటుకు రూ.5వేల చొప్పున పంచారన్నారు. తమకు డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు ధర్నా చేసేందుకు రోడ్డెక్కిన సందర్భాలు చూశామని చెప్పారు. బిజెపి, బిఆర్ఎస్ పోటీ పడి ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇచ్చి, రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేశాయన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ దుకాణాల్లో ప్రతి నెల రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని, కానీ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 20 రోజుల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ మందు పంచలేదు, పైసలూ ఇవ్వలేదన్నారు.

అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా, మద్యం పోయకుండా ముందుకు సాగుదామని తాను కెసిఆర్‌కు సవాల్ చేశానని, ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు రావాలని చెప్పానని అన్నారు. మంచి సంప్రదాయాన్ని అందిద్దామనే ఉద్దేశ్యంతో ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు ఆహ్వానిస్తే ఆయన రాలేదన్నారు. తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తానంటే పోలీసులు తనను నిర్బంధించారన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? నిరూపించాలన్నారు. కెసిఆర్ మాయ చేసి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారన్నారు. కెసిఆర్ నమ్ముకున్నది ప్రజలను కాదని… మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నారన్నారు.

ఈ రోజు తనను అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ అని, దీని డీసీపీ రాధాకిషన్ రావు కెసిఆర్ రక్త సంబంధీకుడని ఆరోపించారు. రాధాకిషన్ రావు బాస్ ప్రభాకర్ రావు అని, ఆయన కూడా కెసిఆర్‌కు దగ్గరివాడన్నారు. తాము ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ రోజు కెసిఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, కానీ యువత పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ మేనిఫెస్టోలో నియామకాల ప్రస్తావన లేదన్నారు.

తాను 30 లక్షల మంది నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నానని, మీ ఓటు, మీ కన్నతల్లిదండ్రుల ఓటు కలుపుకుంటే దాదాపు 90 లక్షల ఓట్లు అవుతాయని, ఈ ఓట్లు పడితే చాలు 90 సీట్లు వస్తాయని పిలుపునిచ్చారు. ఇక ఎవరి ఓటు అవసరం లేదన్నారు. మీ ఓటు వేసి కెసిఆర్, కెటిఆర్ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తీసుకు రావాలన్నారు. ఆ తర్వాత ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఓయు, కేయు విద్యార్థులు రంగంలోకి దిగితేనే తెలంగాణ వచ్చిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ శక్తిని తక్కువగా అంచనా వేయవద్దన్నారు. అందుకే ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగి ముందుకు రావాలన్నారు.