న్యాయవాదులతో చంద్రబాబుకు ములాఖత్ కుదింపు

ఇక రోజుకు ఒకేసారి..ములాఖత్‌ను కుదించిన జైలు అధికారులు

Chandrababu meeting with lawyers has been shortened

హైదరాబాద్‌ః స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుతో ఆయన న్యాయవాదుల బృందం ములాఖత్‌ను అధికారులు కుదించారు. లీగల్ ములాఖత్‌లు ఇప్పటి వరకు రెండు ఉండగా, దీనిని ఒకటికి కుదించారు. అంటే చంద్రబాబు న్యాయవాదులు రోజుకు రెండుసార్లు జైల్లో ఆయనను కలిసేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి కలవాల్సి ఉంటుంది.

చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయనపై ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులలోను చంద్రబాబు పేరు ఉంది. ఈ కేసుల నిమిత్తం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే నిమిత్తం చంద్రబాబుతో మాట్లాడేందుకు న్యాయవాదుల బృందం రోజుకు రెండుసార్లు చంద్రబాబుతో భేటీ అవుతోంది. కానీ ఇప్పుడు భద్రతా కారణాలతో ఒకేసారి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు.

చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఏర్పడుతోందని జైలు అధికారులు చెబుతున్నారు. పరిపాలనా కారణాలతో రెండో ములాఖత్ రద్దు చేసినట్లు తెలిపారు. అయితే.. చంద్రబాబును జైల్లో మరికొన్ని రోజులు ఉంచేందుకే కుట్రపూరితంగా రెండో ములాఖత్ రద్దు చేసినట్లు టిడిపి అనుమానిస్తోంది.