ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ప్రధాని మోడీ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతోపాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చే దిశగా ప్రధాని ప్రయత్నించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని చెప్పి తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చారని ఆయన అన్నారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సహా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని తన లేఖలో గుర్తు చేశారు. అలాగే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలతోనే సరిపెడుతున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని రేవంత్ లేఖలో ప్రస్తావించారు.