బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి కామెంట్స్

కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ మొదటి భారీ బహిరంగ సభ..బుధువారం ఖమ్మం లో భారీ ఎత్తున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరై గులాబీమయం చేసారు. ఈ సభలో కేసీఆర్ బిఆర్ఎస్ ఎజెండా ఏంటో తెలిపాడు. అలాగే బిఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నట్లు పంజాబ్ , కేరళ , ఢిల్లీ ముఖ్యమంత్రులు సభ ముఖంగా తెలిపారు. ఇక ఈ సభ ఫై బిజెపి , కాంగ్రెస్ శ్రేణులు పలు విమర్శలు , కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సభ ఫై స్పందించారు. ప్రధాని మోడీని రక్షించడానికే కేసీఆర్ కాంగ్రెస్ పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు నిజంగానే బీజేపీని ఓడించాలనే కోరిక ఉంటే, వెళ్లి గుజరాత్ లో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. బీజేపీ చెర నుంచి దేశాన్ని విడిపిస్తామని చెబుతున్న కేసీఆర్… హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు.

సంవత్సరాల తరబడి మోడీ తో కేసీఆర్ అంటకాగారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మోడీ అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు పరిశ్రమలను తీసుకువచ్చింది కాంగ్రెస్ సర్కారేనని తెలిపారు. అలాగే కేసీఆర్​ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేయబోతున్నారని రేవంత్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్​ కుట్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు. కర్ణాటకలో 25మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్​ ఇటీవల మాట్లాడి వారికి 500కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.

తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్‌ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని.. బీఆర్​ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ చెప్పుకొచ్చారు.