ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏను 3% పెంచిన కేంద్రం

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏను 3% పెంచిన కేంద్రం

ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక అందజేసింది కేంద్రం. డీఏను 3% పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచుతున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ పెంపు 2021 జులై నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28 శాతం ఉండగా తాజా నిర్ణయంతో 31 శాతానికి చేరింది.

కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.100లక్షల కోట్లతో మల్టీ మోడల్‌ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తారు. రోడ్డు, వాయు, జల రవాణా మార్గాలను అనుసంధానం చేస్తారు. లాజిస్టిక్స్‌ రంగంలో ఖర్చులను, సమయాన్ని తగ్గించడం, సరుకుల రవాణా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చనున్నారు.