అగ్నిపధ్ కు వ్యతిరేకంగా రేపటి నుండి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Agnipath protests: Cong announces solidarity ‘Satyagraha’

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపధ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాల్గు రోజులుగా పెద్ద ఎత్తున ఆర్మీ విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు , నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం దిగిరావడం లేదు. ఈ తరుణంలో రేపటి (జూన్ 19) నుండి ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలను అగ్రనాయకత్వం కోరిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మ‌రోవైపు వివాదాస్ప‌ద సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన త‌ర‌హాలోనే అగ్నిపథ్ స్కీంను ఉప‌సంహ‌రించాల‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని కోరారు. గ‌త ఏడాది మూడు సాగు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించే స‌మ‌యంలో రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన విధంగానే దేశ యువ‌త‌కు మోదీ మ‌రోసారి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రాహుల్ గాంధీ కోరారు. ఇక అగ్నిపథ్​ పథకంపై నిరసనలు ఈరోజు కూడా కొనసాగాయి. శుక్రవారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా.. శనివారం పరిస్థితులు కొంచెం శాంతించాయి. పలు చోట్ల శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడు చెన్నైలోని సెక్రటేరియట్​ సమీపంలో యుద్ధ స్మారకం వద్ద భారీగా యువత గుమికూడారు. అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆర్మీ ఆశావహులు నిరసనలు చేస్తున్నారు. వెల్లూర్​, తిరువన్నమలై, తిరుప్పుర్​ సహా పలు జిల్లాల నుంచి నిరసనకారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.